అల్లర్లకు పన్నాగం

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పోటీ ఇవ్వలేక అష్టకష్టాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ ప్రజల దృష్టిని మళ్లించేందుకే అక్కడక్కడ చిల్లర గొడవలకు దిగడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వాటినే ఎల్లో మీడియా ద్వారా భూతద్దంలో చూపించి మరింత రాద్ధాంతం సృష్టిస్తుండడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ఆదరణ పూర్తిగా కోల్పోయి తిరిగి పుంజుకునే అవకాశం ఏమాత్రం లేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే కొన్ని సమస్యాత్మక గ్రామాల్లో సహజంగా ఉండే రాజకీయ కక్షలను రెచ్చగొడుతున్నట్లు స్పష్టమవుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే గ్రహించిన చంద్రబాబు.. ప్రజలను ఏమార్చేందుకు, ఓటమికి సాకులు చెప్పుకునేందుకే వ్యూహాత్మకంగా ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆయనన్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో బుధవారం జరిగిన సంఘటన కూడా ఇందులో భాగమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.